గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆయన మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామని.. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని తెలిపారు. భవిష్యత్ లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని వెల్లడించారు.
టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందన్నారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందని తెలిపారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ కు కీలక స్థానం ఉంటుందన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకూ అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని తెలిపారు. సీట్లు, ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ ప్రయివేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు హ్యాకర్స్ ను ఉపయోగించి మా ఫోన్ లు హ్యాక్ చేస్తున్నారని.. దీంతో కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మేం ఫోన్ లో ప్రయివేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని ఆరోపించారు. మమ్మల్ని సంప్రదించిన వారిని బెదిరిస్తున్నారని.. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.