తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి : రేవంత్

తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  19 Nov 2023 12:09 PM IST
తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి : రేవంత్

తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీట్ ది ప్రెస్ లో ఆయ‌న మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన.. సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. గా వెల్ల‌డించారు. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమినే అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదన్నారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు.

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని.. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని గుర్తుచేశారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామ‌ని.. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని ఆరోపించారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని.. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు.

నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామ‌ని తెలిపారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ ను ప్రజల ముందుంచామ‌న్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలని సూచించారు.

ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి. ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవం కోసమ‌న్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని జోష్యం చెప్పారు. గతంలో కాంగ్రెస్ లో ఎవరు సీఎంగా ఉన్న‌ ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తామ‌న్నారు. కేసీఆర్ కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదు.. ఆయన రాచరికం అనుకుంటున్నారన్నారు.

రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయి. 2 వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే పింఛ‌న్ కంటే కర్ణాటకలో పెన్షన్ తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందని తెలిపారు. కేసీఆర్ సవాల్ లో పస లేదన్నారు.

60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1 లక్షా 80వేలు బాకీ ఉన్నారని పేర్కొన్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమేన‌న్నారు. బలహీనవర్గాలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో ఉన్నారని.. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్ కు సహకరించడమే బీజేపీ వ్యూహం అన్నారు.

ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు.. ఇప్పటికీ అతీగతి లేదన్నారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదన్నారు. దళితుల ఓట్లు కాంగ్రెస్ కు రాకుండ చీల్చేందుకే కమీటీతో కాలయాపన చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Next Story