బోథ్ కు నీళ్లు రాకపోవడానికి సీఎం కేసీఆరే కారణం : రేవంత్
ఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్ కు రెండు కళ్లలాంటివారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 15 Nov 2023 9:19 AM GMTఆదివాసీలు, లాంబాడాలు కాంగ్రెస్ కు రెండు కళ్లలాంటివారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బోథ్ లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకున్నాడు. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారని తెలిపారు.
ఓటు చీలిపోకుండా కూడాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు? తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పిందన్నారు.
కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు.. కట్టిన మేడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందన్నారు. బోథ్ కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణమన్నారు. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. బోథ్ కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలన్నారు. ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించండి.. డిసెంబర్ 31లోపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాదని హామీ ఇచ్చారు. కుఫ్టీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాదన్నారు.
ఆదిలాబాద్ నుంచి అచ్ఛంపేట అడవుల వరకు కాంగ్రెస్ ను గెలిపించండని కోరారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. దొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ అని కొనియాడారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు.