ఓటుకు పదివేలు ఇచ్చి బీఆర్ఎస్ గెలవాలనుకుంటోంది : రేవంత్
బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 17 Nov 2023 4:23 PM ISTబీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదన్నారు. కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది నేను.. పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదని వివరించారు. ఓటుకు పదివేలు ఇచ్చి బీఆర్ఎస్ గెలవాలనుకుంటోంది.. మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తాం. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం. మహిళలందరికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.