సంతోషంగా ఉంది.. అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు : రేవంత్

పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  30 Nov 2023 2:26 PM GMT
సంతోషంగా ఉంది.. అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు : రేవంత్

పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మరోసారి నిరూపించారని అన్నారు. మలిద‌శ‌ తెలంగాణ ఉద్య‌మంలో అమరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి అర్పిస్తున్నాన‌ని తెలిపారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆనాడు డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుది శ్వాస వదిలాడు.. యాదృశ్చికంగా డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. డిసెంబర్ 9, 2009న మొదటి పునాదిరాయి పడింది. ఇప్పుడు అవే తేదీల్లో యాదృశ్చికంగా తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి కలగబోతుందని వివ‌రించారు.

డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలించబోతుందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. సోనియమ్మకు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని సోనియమ్మ కోరిందన్నారు. .

ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు. ఇవాళ ఆ చంద్రుడికి మబ్బులు పట్టినయ్.. ఆయన కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చెప్పింది తప్పయితే.. ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెబుతారా? అని అడిగారు. కాంగ్రెస్ శ్రేణులు డిసెంబర్ 3 వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 గంటల నుంచే సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గెలిచిన వాడు రాజు కాదు.. ఓడినవారు బానిసలు కారని అన్నారు. అధికార, ప్రతిపక్షాలది బాధ్యతాయుతమైన పాత్ర అని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరిస్తుందన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తాం.. తెలంగాణా ప్రజలకు పీసీసీ అధ్యక్షుడుగా మాట ఇస్తున్నాన‌న్నారు. సమాజంలో అందరికీ స్వేచ్ఛ,సమానత్వం, సమాన అభివృద్ధి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేయదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ అధికారాన్ని ఉపయోగిస్తుందన్నారు. మేం పాలకులం కాదు సేవకులమ‌న్నారు,

తెలంగాణకు మొదటి, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలోని నలుగురే.. మిగతా వారంతా మనకు మిత్రులేన‌ని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ కుటుంబంతో అంటగాకినవారు.. ప్రజాక్షేత్రంలో ప్రజలకు క్షమాపణ చెప్పి సేవకులుగా ఉండాలన్నారు.

బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటవన్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చిందన్నారు. ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచలు ఎంత? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసుకునే సంబరాలు వార్ రూమ్ లో కాదు.. బార్ రూమ్ లో అన్నారు.

అమరుల కుటంబాల సంక్షేమంపై కోదండరాంకి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లో కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. నిర్ణయాలు తీసుకునేటపుడు కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు.

కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం అని జాగ్ర‌త్త చెప్పారు. మా ముందున్న లక్ష్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఆరు గ్యారంటీలకు చట్టబద్దత, ప్రజాస్వామిక పాలన అని పేర్కొన్నారు. నేను ఏ పదవిలో ఉండాలో.. ఏ పదవికి రాజీనామా చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

Next Story