మేమిద్దరం అనుకుంటే బీఆర్ఎస్ జెండా ఎక్కడా కనిపించదు : రేవంత్
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండని.. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా
By Medi Samrat Published on 24 Nov 2023 1:57 PM GMTతెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండని.. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నకిరేకల్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు.. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదన్నారు.
చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్నిండు.. పార్టీ ఫిరాయించి దొరగారి గడీలో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు.. పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దన్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడమొలిచినా.. ప్రాణం పోయినా.. ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వొద్దని సూచించారు. ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.
ఆనాడు వెంకన్న వైఎస్ తో కొట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కకు పెట్టారని తెలిపారు. నకిరేకల్ వేదికగా కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా.. ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు.? అని ప్రశ్నించారు.
కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు అని కామెంట్ చేశారు. 60 ఏళ్లల్లో 16 మంది సీఎంలు చేసిన అప్పు 69 వేల కోట్లు.. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు 6 లక్షల కోట్లు అని వివరించారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు.
కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడని ఎద్దేవా చేశారు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. వెంకట్ రెడ్డి, నేను ఇద్దరం అనుకుంటే.. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ జెండా ఎక్కడా కనిపించదు.. బీఆర్ఎస్ లో ఎవ్వరూ గెలవరన్నారు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించండి.. కేసీఆర్ ను డిసెంబర్ 9 న బీఆరెస్ ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాదన్నారు.