టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నారాయణ్ ఖేడ్లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్ స్వాతంత్ర్యం కోసం నినదించారని తెలిపారు. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్ ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది అని మాట ఇచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేసే బాధ్యత మాది అని పేర్కొన్నారు. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు.. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్ లో పడుకున్నావా? అని ప్రశ్నించారు.
నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.