ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయలు భాకీ ఉన్నారు

Revanth Reddy Comments CM KCR. సీఎం కేసీఆర్ పథకాలను పైన పటారం- లోన లోటారం అన్నట్లు రచించారని టీపీసీసీ

By Medi Samrat  Published on  29 Sep 2021 12:11 PM GMT
ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయలు భాకీ ఉన్నారు

సీఎం కేసీఆర్ పథకాలను పైన పటారం- లోన లోటారం అన్నట్లు రచించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు విలువలేకుండా టీఆర్ఎస్ పాలన సాగుతోందని అన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 9వరకు కార్యక్రమాలు ఉంటాయ‌ని.. డిసెంబర్ 9న విద్యార్థి యువజన భారీ కార్యక్రమం ఉంటుంద‌ని తెలిపారు. మలిదశ ఉద్యమానికి శ్రీకాంతాచారి మొదటి అమరుడయ్యారని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించేందుకు ఫీజు రియంబర్స్ మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిందని.. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల వల్ల వేలమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బకాయిలు ఉన్న 4వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తారా? ఇవ్వరా అనేది స్పష్టత ఇవ్వాలని.. తెలంగాణ రాష్ట్రంలో 60లక్షల మంది పట్టబద్రులైన‌ నిరుద్యోగులు ఉన్నారని.. ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ 1లక్ష రూపాయలు భాకీ ఉన్నారని.. ఫీజు రియంబర్స్ మెంట్- నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ నియామకంపై పోరాటం చేస్తామ‌ని అన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థి నిరుద్యోగ జంక్ సైరన్ కార్యక్రమం చేప‌డ‌తామ‌ని అన్నారు. దిలీషుఖ్ న‌గర్ చౌరస్తా నుంచి పాదయాత్ర చేస్తూ ఎల్బీ నగర్ వరకు వెళతామ‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలు ఆగాలంటే సోనియమ్మ రాజ్యం రావాల‌ని.. ఉమ్మడి రాష్ట్రం కంటే ఇవ్వాళ తెలంగాణ అత్యధికంగా ప్రమాదంలో ఉందని అన్నారు. హుజురాబాద్ ఎన్నికపై మాకు వ్యూహం ఉందని.. హుజురాబాద్ అభ్యర్థి పై సీఎల్పీ నేతృత్వంలో కమిటీ ఉందని.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని అన్నారు. హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఉంటాడని.. మాతో కలిసి వచ్చే పార్టీలను, వ్యక్తులను కలుపుకుంటామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.


Next Story