రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు.
By అంజి Published on 6 Dec 2023 8:02 AM GMTరేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగాప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. తెలంగాణ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పార్టీ నేతలు, అధికారులు రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ఇప్పటికే సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లోని కీలక వ్యక్తులతో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేతలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు కూడా ఆహ్వానం పంపారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు,రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్,తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపించారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు అలాగే తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు.. కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు కూడా ఆహ్వానం పంపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపారు.