మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) సిద్ధం చేస్తున్న నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి నెల రోజుల్లో అందనుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా వాటికి మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు అందేలా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిందని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ, ఇతర బ్యారేజీలకు విజిలెన్స్ శాఖ సమర్పించే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకుంటుందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిందని, సబ్ కాంట్రాక్ట్ ద్వారా పనులు చేసిన దాఖలాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. దీంతో మేడిగడ్డ బిల్డర్ ఎల్ అండ్ టీకి రూ.400 కోట్ల పెండింగ్ బిల్లులు నిలిచిపోయాయని వివరించారు. మేడిగడ్డ నష్టంపై విచారణకు కమిటీ వేయడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. మేడిగడ్డ పరిస్థితిపై చర్చించేందుకు నిపుణులు, అధికారులతో శనివారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.