ఖమ్మంలో నో వేకెన్సీ.. ఆల్రెడీ రిజర్వ్‌డ్ ఫర్ కాంగ్రెస్ : రేణుకా చౌదరి
Renuka Chowdhury Fire On CM KCR. సీఎం కేసీఆర్‌పై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Jan 2023 12:47 PM GMTసీఎం కేసీఆర్‌పై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్.. ట్రిపుల్ తలాక్ అప్పుడు ఎవరికి సపోర్ట్ చేశావ్.. పార్లమెంట్ లో బిల్లులన్నింటికి బీజేపీకి మద్దతు పలికింది ఎవరని ప్రశ్నించారు. నీ డ్రామాలు అందరికి తెలుసునని.. ఈశాన్య మూలం ఎవరో చెప్పారని అక్కడ మకాం వేస్తున్నాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టక ముందే మీడియాకు క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. భూములు కేటాయిస్తామని.. కాంగ్రెస్ ఇచ్చిన భూములు లాగేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడే మాటలకు జీఎస్టీ లేదు కాబట్టే నాలుకను తిప్పేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సర్పంచుల మీద కనీసం జాలి కూడా లేదని అన్నారు.
అర్ధరాత్రి వేళ ఇళ్లల్లో దూరి నా కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు.. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారారని మండిపడ్డారు. జిల్లాలో మీ మంత్రి చేసే దోపిడీలు, దొంగతనాలు తెలియట్లేదా.. మీకెంత వాటాలు వస్తున్నాయి. మీ అబ్బాయి గారిని అడగండి.. ఇక్కడ కొండలు, గుట్టలు మాయమైపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ది అని విమర్శించారు.
ఖమ్మం.. ఇది కాంగ్రెస్ జిల్లా.. ఇది నా హెచ్చరిక.. రాబోయే ఎన్నికల్లో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఖమ్మంలో నో వేకెన్సీ.. ఆల్రెడీ రిజర్వ్ డ్ ఫర్ కాంగ్రెస్ అని ఘంటాపథంగా చెప్పారు. పోయినసారి పైసా పంచకుండా కార్యకర్తలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి ఆరుగురిని గెలిపించారని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చే మిరపకాయకో, కేసీఆర్ ఇచ్చే సొరకాయకో ప్రజలు ఆశపడట్లేదని అన్నారు.
ఖమ్మంలో నేను కాంగ్రెస్ చేసిన అభివృద్ధి.. ఎవరైనా చేశారా అని ఛాలెంజ్ విసిరారు. ఆ శ్రీరాముల వారు కూడా ఇక నిన్ను క్షమించరని.. అసలు ఖమ్మం చరిత్ర నీకు తెలుసా కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 18న పెట్టె బహిరంగ సభకు మజ్లీస్ ను ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. పవిత్ర అసెంబ్లీ సాక్షిగా నువ్ ఇచ్చిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నవా అంటూ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుతానన్న ఎమ్మెల్యేలు.. దాన్ని దిగజార్చే దుస్థితికి స్పీకర్ కూడా చేరారని రేణుకా చౌదరి విమర్శించారు.