ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం నాడు ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కిపైగా పాటలు రాశారు.
1958 ఏప్రిల్ 14వ తేదీన అనిశెట్టి రజిత జన్మించారు. చిన్నతనం నుండే తెలంగాణ ఉద్యమ సంఘర్షణలు, కవి సమ్మేళనాలు, దాశరథి, ఆరుద్ర తదితరుల ఉపన్యాసాలకు ఆమె ఎంతో ఆకర్షితురాలయ్యారు. 1969లో కాజీపేటలోని ఫాతిమా నగర్ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సమయంలోనే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. 1973లో 'చైతన్యం పడగెత్తింది' అనే తొలి రచనతో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో చేసిన ఈ రచన ద్వారా ఆమె సాహితీ వ్యక్తుల ప్రశంసలు అందుకున్నారు.
1980ల నాటి ఉద్యమ అనుభవంతో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’, స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘నేనొక నల్లమబ్బునవుతా’, ‘చెమట చెట్టు’, ‘ఓ లచ్చవ్వ’, ‘ఉసురు’, ‘గోరంత దీపాలు’, హైకూల సంపుటి, ‘దస్తఖత్’, ‘అనగనగా కాలం’, ‘మట్టి బంధం’, నన్హే ఓ నన్హే’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’, ‘నిర్భయాకాశం కింద’, ఆచార్య పాకాల యశోదా రెడ్డిపై మోనాగ్రాఫ్ రాశారు.
అనిశెట్టి రజిత 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, 2016లో తెలుగు రచయితల వేదిక వారి అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం అందుకున్నారు.