హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరు ప్రస్తావించడంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా స్మితా సబర్వాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ తన వివరణ కోరలేదని, 8బి 8సి నోటీస్ ఇవ్వలేదని స్మితాసబర్వాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఆమెకు ఊరటనిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది.
మరో వైపు స్మితాసబర్వాల్ చర్యలను పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై స్మితాసబర్వాల్ రివ్యూ చేశారని కమిషన్ పేర్కొంది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు అప్పటి సీఎం కేసీఆర్‌కు స్మితా సబర్వాల్ చేరవేశారని పీసీ ఘోష్ కమిషన్‌లో తెలిపారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మితసబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారు. కాళేశ్వరం అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సబర్వాల్ పోషించారు..అని పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టులో తెలిపింది. దీంతో నిజనిజాలను కేబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు చేసింది.