తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. రుణమాఫీ ప్రక్రియలో తొలివిడతగా ఈ రోజు లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవనున్నాయి. తద్వారా రాష్ట్రంలోని దాదాపు పదకొండున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
మొత్తం రూ.7,000 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేయడంతో కష్టాల్లో కూరుకుపోయిన చాలా మంది రైతులకు ఉపశమనం కలుగనుంది. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెలాఖరులోగా రూ.1.5 లక్షలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రంలోని రైతులను, వ్యవసాయాన్ని ఆదుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు.
రైతు రుణమాఫీతో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరు గుజరాత్ మోడల్ అని, మరొకరు ఇంకో మోడల్ అంటున్నారు.. కానీ నేడు తెలంగాణ మోడల్ దేశంలోని రైతులకు, రాజకీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంగా మారబోతోందన్నారు. సవాళ్లు విసిరిన వారు.. మేము మిమ్మల్ని రాజీనామా చేయమని అడగడం లేదు.. ఎందుకంటే మీరు ఎలాగైనా పారిపోతారు. నెలాఖరున వరంగల్‌లో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపే బహిరంగ సభ జరగనుందని వెల్లడించారు.