పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి వేతన స్కేలు అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కోరారు. పంచాయతీ కార్యదర్శుల సేవలను క్రమబద్ధీకరించడం ద్వారా వారి ఉద్యోగానికి భద్రత కల్పించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పారిశుధ్య పనులు, హరితహారం కార్యక్రమం, పన్నుల వసూళ్లు మొదలుకొని దోమల నివారణ వరకు ఈ ఉద్యోగులు సేవలందిస్తున్నారని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు.. కొన్ని సందర్భాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఆదుకోవాలని లేఖలో కోరారు.