రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్: మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతా వారికీ అందజేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. కాగా మొదట ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54 కోట్లు, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29 కోట్లు, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి డైరెక్ట్ బెనిఫీషియరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ.1230 కోట్లు ఖాతాల్లో వేశారు.
జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేశారు. అటు నిన్ననే ప్రధాని మోదీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.