హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ సమ్మక్క-సారక్క హాస్టల్‌లో సోమవారం రాత్రి ఎలుకలు దాడి చేయడంతో 14 మంది విద్యార్థినులు గాయపడ్డారు. వర్సిటీ హెల్త్ సెంటర్‌లో కనీస మందులు, టెటానస్, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.
క్యాంపస్‌లో పారిశుధ్య లోపం, గదుల్లో చెత్త పేరుకుపోవడం వల్లే ఎలుకల బెడద పెరిగిందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే హాస్టల్ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని, శాశ్వత ప్రాతిపదికన పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టడంతో పాటు 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు పారిశుధ్య పనులు చేపడుతున్నామని చెబుతున్నా, స్పష్టమైన గడువు మాత్రం ప్రకటించలేదు.