అల్లు అర్జున్ నటించిన యాడ్.. దిగొచ్చిన ర్యాపిడో
Rapido On TSRTC Notices. సినీ నటుడు అల్లు అర్జున్‌తో చిత్రీకరించిన ర్యాపిడో వాణిజ్య ప్రకటన అనుకోని కారణాల వలన వార్తల్లో
By Medi Samrat Published on 13 Nov 2021 5:31 PM ISTసినీ నటుడు అల్లు అర్జున్‌తో చిత్రీకరించిన ర్యాపిడో వాణిజ్య ప్రకటన అనుకోని కారణాల వలన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే..! ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ లో సజ్జనార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు.
తాము ఇచ్చిన నోటిసులకు సమాధానం రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు. ఈ విమర్శలపై బైక్ రైడింగ్ యాప్ ర్యాపిడో స్పందించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులకు స్పందించిన ర్యాపిడో.. టీఎస్ ఆర్టీసీ బస్సులను చూపిస్తూ చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించింది. ర్యాపిడో చిత్రీకరించిన ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల్లా చాలా సమయం తీసుకుంటాయని.. ర్యాపిడో మాత్రం చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అల్లు అర్జున్ ప్రకటనలో చెప్పారు. ఈ ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులతో వెనక్కి తగ్గిన ర్యాపిడో ఆ సన్నివేశాలను తొలగించింది.