రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవి అత్యంత ధైర్యవంతురాలని, తెలుగు జాతికి గర్వకారణమని, ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తి, ఆదర్శప్రాయమని అన్నారు. కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో పర్యటించారు.
గ్రామస్తులు గవర్నర్‌కు ఘనంగా స్వాగతం పలికి రాణి రుద్రమదేవి విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చందుపట్ల గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ముఖ్యమైన శాసనం ఉంది. శిలా శాసనాన్ని సందర్శించిన గవర్నర్ శాసనం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాణి రుద్రమకు తగిన పేరు రాలేదని, రుద్రమదేవి చరిత్రను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చారిత్రక ప్రదేశం చందుపట్లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాకతీయ వంశ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందుకు గ్రామ ముఖద్వారం వద్ద స్వాగత తోరణాన్ని నిర్మించాలని గ్రామస్తులు గవర్నర్‌కు విన్నవించారు. అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, డీఆర్‌వో జగదీశ్వర్‌రెడ్డి, డీపీఆర్‌వో శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.