రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Ramappa Temple in Telangana gets inscribed as a Unesco World Heritage Site. తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

By Medi Samrat  Published on  25 July 2021 12:21 PM GMT
రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అదే నేడు యునెస్కో గుర్తింపు వచ్చేలా చేసింది.

రామప్ప వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో పాలంపేట గ్రామంలో ఉంది. క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. తన శిల్పకళతో ఆలయాన్ని అద్భుతంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. రామప్ప గుడి త్రికూటాలయం కాకపోయినప్పటికీ.. ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఉంటుంది. ఆలయం నిర్మించిన ఇటుకుల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకొంటారు. ఇవి నీటిలో తేలుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు.రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు.

చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు యునెస్కో బృందం తెలిపింది. దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను వివరించింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్‌లలో పరిగణలోకి తీసుకునేలా రష్యా చేసింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా తదితర దేశాలు మద్దతు ఇవ్వడం విశేషం. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ స్థలంగా ఎంపిక‌వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ మ‌రికొద్ది ప్ర‌ముఖులు ట్విట‌ర్ వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేశారు.



Next Story