గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని.. గోషామహాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయటానికి తాను రెడీ అంటూ చెప్పుకొచ్చారు. గోషామహాల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు నిధులిస్తే రాజీనామా చేస్తానని.. గోషామహాల్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్‌కు ఎమ్మెల్యే సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గానికి నిధులు ప్రకటించిన వెంటనే తాను స్పీకర్ ను కలసి రాజీనామా లేఖ ఇస్తానని సవాల్ చేశారు రాజా సింగ్.
గోషామహాల్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని.. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించండి. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.