కరువొచ్చినా, కష్టమొచ్చినా.. రైతులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్
రైతంగానికి సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
By అంజి Published on 7 March 2024 2:21 AM GMTకరువొచ్చినా, కష్టమొచ్చినా.. రైతులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. కరువొచ్చినా, కష్టమొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను అనుసంధానం చేస్తూ వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ప్రారంభించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ రఘునందనరావు, డైరెక్టర్ గోపి, రైతు సంఘాల ప్రతినిధులు సుంకెట అన్వేష్ రెడ్డి, నల్లమల వెంకటేశ్వర రావు, వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు ఇందులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంతో అనుసంధానం చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలి విడత 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ. 97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సదుపాయం వీలుకల్పిస్తుంది. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ రంగంలో అధునాతన మెలకువలను వారికి అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు.
ప్రతి సీజన్‌లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు.
రాష్ట్రంలో ఎదురవుతున్న కరవు పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి, మిర్చీ పంటలకే పరిమితం కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని, రైతులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు రైతు బీమా పథకంతో పాటు పంటల బీమా పని చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.