ఏపీ, తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 24 July 2023 9:00 AM ISTఏపీ, తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ దక్షిణ ఒడిశా పరిసరాలలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కూడా షియర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ - 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. 24న ఒక అల్పపీడనం దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో ముసురు వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల చెదురుముదురు జల్లులు పడ్డాయి. కాగా రాష్ట్రానికి వర్ష తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఎల్లుండి నుంచి కోస్తాలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అదే సమయంలో రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం నుంచి విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి.