భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, కరీంనగర్, కుమురం భీమ్, మంచిర్యాల్, మేడ్చల్ -మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ మీదుగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఆగస్టు 3 వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వాయవ్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 2,3,4 తేదీల్లో కొంకణ్ తీరం, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.