తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని
By అంజి Published on 30 May 2023 7:30 AM GMTతెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, మంగళవారం రాగల కొద్ది గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. రాష్ట్రంలోని పలుచోట్ల కురుస్తున్న వర్షాలతో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ జిల్లా పరకాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడుతున్నది. వరంగల్ జిల్లా నర్సంపేటలో, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేట, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో, ఇల్లందు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపళ్లి మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది.