Telangana Polls: నేడు బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక గాంధీ
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 18 Oct 2023 7:29 AM ISTTelangana Polls: నేడు బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక గాంధీ
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఇతర సీనియర్ నేతలతో కలిసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు రామప్ప ఆలయాన్ని సందర్శించి శివుడిని దర్శించుకోనున్నారు. తొలిరోజు ములుగు, భూపాలపల్లి ఏరియాలో మహిళా సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తారు. రెండో రోజు కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ బస్సుయాత్ర, మరుసటి రోజు నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తారని రేవంత్ రెడ్డిని తెలిపారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
మహిళా సమ్మేళనం తర్వాత ప్రియాంక ఢిల్లీకి తిరిగి వెళ్లనుండగా, రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే ఇంతకుముందు చెప్పారు. ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి కాలరీస్ కార్మికులతో ఆయన సమావేశమవుతారని, అక్టోబర్ 19న పెద్దపల్లి, కరీంనగర్‌లలో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారని ఠాక్రే తెలిపారు. అక్టోబర్ 20న రాహుల్ గాంధీ జగిత్యాలలో రైతులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని, ఆర్మూర్, నిజామాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు.
బస్సుయాత్ర మూడు దశల్లో జరుగుతుంది. మొదటిది అక్టోబర్ 18 నుండి 20 వరకు కొనసాగుతుంది. మొదటి రోజు యాత్ర మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొదటి దశను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
టీపీసీసీ చైర్మన్ (ప్రోటోకాల్) హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ‘‘రాహుల్, ప్రియాంక బేగంపేట విమానాశ్రయం లేదా శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో వచ్చి హెలికాప్టర్‌లో రామప్ప ఆలయానికి వెళ్తారు. నగరంలో ఎలాంటి షెడ్యూల్ కార్యక్రమాలు లేవు. ప్రియాంక తిరిగి వచ్చే షెడ్యూల్ ఎప్పుడు తెలియజేయబడలేదు." రామప్ప ఆలయంలో ప్రధాన స్వాగత కార్యక్రమం ఉంటుంది. రాహుల్, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ డి. శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలుకుతారు.