తెలంగాణలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'

Rahul Gandhi's 'Bharat Jodo Yatra' in Telangana. కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది.

By అంజి  Published on  23 Oct 2022 4:36 AM GMT
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాహుల్‌ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టారు. రాహుల్ గాంధీకి ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ తదితర నాయకులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కృష్ణా నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం నిలిచింది. బ్రిడ్జి మొత్తం జనంతో నిండిపోయింది. రాహుల్‌ గాంధీ యాత్రలో పాల్గొనేందుకు కార్యకర్తలు.. నాయకులు వేలాదిగా తరలివచ్చారు.

యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. జాతీయ జెండాను పట్టుకోని రాహుల్ గాంధీతో యాత్రలో నడిచారు. ఇవాళ 3.9 కి.మీ. మేర మాత్రమే యాత్ర సాగింది. దీంతో తెలంగాణలో తొలి రోజు రాహుల్‌ గాంధీ యాత్ర ముగిసింది. అనంతరం రాహుల్‌ గూడబల్లేరు నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ల నున్న రాహుల్ గాంధీ. ఇప్పటి నుంచి పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ ఉదయం భారత్‌ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

దీపావళి పండగ నేపథ్యంలో 24, 25, 26వ తేదీల్లో భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. పండగ ముగిసిన తర్వాత... మళ్లీ అక్టోబరు 27 నుంచి నవంబరు 7 వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. తెలంగాణలో మొత్తం 12 రోజుల పాటు 375 కి.మీ. మేర భారత్ జోడో యాత్ర సాగుతుంది. 7 జిల్లాలు, 7 లోక్‌సభ, 17 అసెంబ్లీ స్థానాల్లో యాత్ర ఉంటుంది. ప్రతి రోజూ 20-25 కి.మీ పొడవునా రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతారు. నవంబరు 7న కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ మండలంలోని శాఖాపూర్‌లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. అనంతరం మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.

Next Story