రాహుల్ సభకు సర్వం సిద్ధం.. ఏం మాట్లాడుతారోనని సర్వత్రా ఉత్కంఠ
Rahul Gandhi to announce poll promises. వరంగల్‌లో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ప్రసంగించే బహిరంగ సభలో
By Medi Samrat Published on 6 May 2022 3:52 PM IST
వరంగల్‌లో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ప్రసంగించే బహిరంగ సభలో తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ప్రణాళికలను వెల్లడించనుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి రెండుసార్లు (2014, 2018) అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 'కిసాన్ సంఘర్షణ సభ'తో సన్నాహాకాలు ప్రారంభించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో తన మొదటి బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్.. 2023లో అధికారంలోకి వస్తే రైతులకు, వ్యవసాయ రంగానికి పార్టీ ఏమి చేయాలనుకుంటున్నదో ప్రకటించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభకు ఐదు లక్షల మంది హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ ఓదార్చడంతో పాటు వారితో మాట్లాడి కారణాలను తెలుసుకుంటారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుందనే దానిపై ఆయన ప్రసంగం ఉంటుందన్న ఊహాగానాల నేఫథ్యంలో కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కళాకారులు, చనిపోయిన రైతుల కుటుంబాల కోసం రెండు వేర్వేరు వేదికలను ఏర్పాటు చేశారు. వేదిక, దానికి వెళ్లే రహదారులు వద్ద రాహుల్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో అలంకరించారు. ఇదిలావుంటే.. తెలంగాణలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఈ సాయంత్రం 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం హెలికాప్టర్‌లో హన్మకొండకు బయలుదేరి వెళతారు.