Telangana: ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్న రాహుల్.. షెడ్యూల్ ఇదే
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం పెదపల్లి, కరీంనగర్‌లలో రెండు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
By అంజి Published on 19 Oct 2023 10:14 AM ISTTelangana: ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్న రాహుల్.. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం పెదపల్లి, కరీంనగర్‌లలో రెండు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రకారం.. పార్టీ నిర్వహిస్తున్న మూడు రోజుల "విజయ్ భేరి యాత్ర"లో రాహుల్ పాల్గొంటారు. ఇది బుధవారం ప్రారంభమైంది. కాగా నేడు రాహుల్ రోడ్ షో చేస్తూ పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లలో పాల్గోనున్నారు. మొదట భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. అనంతరం అక్కడే రైతులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేస్తారు.
ఆ తరువాత రోడ్ షో ద్వారా రాహుల్ గాంధీ మంథనికి వెళ్తారు. అక్కడ కాళేశ్వరం ముంపు బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం మంథనిలో రోడ్ షో చేస్తూ సెంటినరీ కాలనీకి వెళ్లి సింగరేణి కార్మికులతో రాహుల్ భేటీ అవుతారు. కార్మికులతో చర్చల తరువాత బస్సు యాత్ర కొనసాగిస్తారు. ఈ క్రమంలో కమాన్ పూర్ క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలోని జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు కరీంనగర్ లో పాదయాత్ర, కార్నర్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు.
హౌసింగ్ బోర్డు సర్కిల్ నుండి కరీంనగర్‌లోని రాజీవ్ చౌక్ వరకు 'పాదయాత్ర' (పాదయాత్ర) కూడా రాహుల్ చేపట్టనున్నారు, అక్కడ ఆయన ఈ సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ములుగులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అధికార బీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేశారు. బీఆర్‌ఎస్‌కి, బీజేపీకి "రహస్య ఒప్పందం" ఉందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని, కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాషాయ పార్టీ, బీఆర్‌ఎస్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాహుల్ అమేథీ లోక్‌సభ స్థానాన్ని బిజెపికి ఎందుకు బహుమతిగా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో రెండు బీ-టీమ్‌లు ఉన్నప్పటికీ.. బీజేపీ ఎందుకు బలహీనంగా ఉందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు అమేథి వదిలి వయనాడ్‌కు పారిపోయారో చెప్పాలన్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు గెలుచుకునే సీట్ల కంటే తన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కే ఎక్కువ సీట్లు ఉన్నాయంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు అసదుద్దీన్.