బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. రెండు పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం మండిపడ్డారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని మంత్రి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదని అన్నారు. రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారని.. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాహుల్ పర్యటనలో రోడ్లు, అభివృద్ధి చూడలేదా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే వరంగల్‌లో రైతు సంఘర్షణ సభను కాంగ్రెస్ నిర్వహిస్తుందా అని అడిగారు. కేంద్రంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమన్నారు. పార్లమెంటులో బీజేపీకి కేవలం రెండే సీట్లు ఉండేవని.. కాంగ్రెస్ వైఫల్యం, విఫల వ్యూహాలతో బీజేపీ బలపడి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి దేశంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కామెంట్లు చేశారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు, వెళ్తుంటారు.. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. కేటీఆర్ కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ మీకు టూరిజం స్పాట్ కావచ్చు. కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే అని ట్వీట్ చేశారు.