హైదరాబాద్ వీధుల్లో రాహుల్ గాంధీ.. ఎవరూ ఊహించలేదు
శనివారం రాత్రి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 5:04 AM GMTహైదరాబాద్ వీధుల్లో రాహుల్ గాంధీ.. ఎవరూ ఊహించలేదు
శనివారం రాత్రి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు. నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్‌లో పర్యటించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలు, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులతో కలిసి చిక్కడపల్లిలోని బావార్చి హోటల్‌లో బిర్యానీ తిన్నారు రాహుల్. కస్టమర్లతోనూ ముచ్చటించారు. రాహుల్ గాంధీతో పలువురు సెల్ఫీలు దిగారు.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో యువతతో ముచ్చటించిన విషయమై రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. "ఈ రోజు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని వారు ఆశించామని చెప్పడం నన్ను కదిలించింది. కానీ 10 సంవత్సరాలు గడుస్తున్నా వారి ఆకాంక్షలు నెరవేరలేదు.కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు." అని విమర్శలు గుప్పించారు. నోటిఫికేషన్ల కొరత, కోర్టు కేసులు, పేపర్ లీకేజీల కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. తాము పోరాడి సాధించుకున్న తెలంగాణలో చెప్పుకోలేని దుస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోయారని.. అయితే వారు దృఢంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Congress National leader @RahulGandhi having paan at the Dimmy Paan Palace, Jubilee Hills in #Hyderabad. He along with @priyankagandhi are in the state campaigning for the #TelanganaElections2023. pic.twitter.com/5FoeO4g3mg
— NewsMeter (@NewsMeter_In) November 26, 2023