తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యింది : రాహుల్ గాంధీ

దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

By Medi Samrat  Published on  20 Oct 2023 1:15 PM GMT
తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యింది : రాహుల్ గాంధీ

దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆర్మూర్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నామ‌న్నారు. తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారు.. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న సొమ్మునంతా మీకు అందేలా చూస్తామ‌న్నారు. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయని టీ కొట్టులో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామ‌న్నారు. రూ.4వేలు పెన్షన్, మహిళల కోసం మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతీ నెలా రూ.2500, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుభరోసా ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వబోతున్నామ‌ని తెలిపారు. నేను అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామ‌న్నారు.

బీజేపీతో పోరాడిన నాపై 24 కేసులు పెట్టారు. మరి కేసీఆర్ పై ఎన్ని కేసులున్నాయని అడిగారు. విపక్షాలపై కేసులు పెట్టె ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఎందుకు పెట్టరు? అని ప్ర‌శ్నించారు. పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆర్ఎస్‌ మద్దతు పలికిందన్నారు. బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నారు. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ను ఓడించేందుకే ఎంఐఎం పోటీ చేస్తుంద‌న్నారు. ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో.. బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోందని అన్నారు, రాష్ట్రంలో బీఆరెస్ ను.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో బీజేపీ ని ఓడించి తీరతామ‌న్నారు. బీజేపీ, ఎంఐఎం కు ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కు వేసినట్లేన‌ని.. తెలంగాణలో రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

Next Story