మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో భార‌త్ జోడో యాత్ర‌.. గిరిజ‌నుల‌తో క‌లిసి రాహుల్ నృత్యం

Rahul Gandhi Bharat Jodo yatra ln Mahaboob Nagar.రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2022 12:06 PM IST
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో భార‌త్ జోడో యాత్ర‌.. గిరిజ‌నుల‌తో క‌లిసి రాహుల్ నృత్యం

కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొన‌సాగుతోంది. శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని ధ‌ర్మాపూర్‌లో గ‌ల జ‌య‌ప్ర‌కాశ్ ఇంజినీరింగ్ క‌ళాశాల నుంచి ప్రారంభ‌మైంది. 15 కిలోమీట‌ర్ల మేర కొన‌సాగింది. దారి పొడ‌వునా యువ‌కులు, చిన్నారులు, మ‌హిళ‌లు, క‌ళాకారులు, వివిధ సంఘాల నాయ‌కులు రాహుల్‌తో ముచ్చ‌టించారు. సినీ న‌టి పూన‌మ్ కౌర్ కూడా రాహుల్‌తో పాద‌యాత్ర‌లో పాల్గొంది.

భ‌ద్రాచ‌లం నుంచి వ‌చ్చిన గిరిజ‌నుల‌తో క‌లిసి రాహుల్ గుస్సాడీ నృత్యం చేశారు. రాహుల్ త‌మ‌తో క‌లిసి నృత్యం చేయ‌డంతో ఆదివాసీ మ‌హిళ‌లు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ తో కలిసి సెప్టులేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీల కళారూపం గురించి వివరించారు.

విద్యారంగ సమస్యలపై మధ్యాహ్నం భేటీ..

విద్యా సంబంధిత సమస్యలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య వివిధ సంస్థలు, ప్రముఖులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. పాలమూరు విద్యావంతుల వేదిక తరపున ప్రో. హరగోపాల్, రఘవాచారి, ఎం.వి ఫౌండేషన్ తరపున వెంకట్ రెడ్డి లతో పాటు స్వచ్చంద సంఘాల నాయకులు నీలిమ, విద్యార్థి నాయకులు తదితరులు రాహుల్ గాంధీతో ఎనుగొండ క్యాంప్ లో భేటీ కానున్నారు. సమగ్ర విద్యా విధానం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీలలో సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

Next Story