ర్యాగింగ్ కలకలం.. మెడికల్ స్టూడెంట్ బట్టలు విప్పించి.. ట్రిమ్మర్‌తో
Raging Commotion In Suryapet.ర్యాగింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2022 11:24 AM ISTర్యాగింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల ఒకటవ తేదీన తనను పిలిచి.. బట్టలు విప్పించి ఫోటోలు, వీడియోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ట్రిమ్మర్‌తో జట్టును తొలగించేందుకు యత్నించినట్లు తెలిపాడు.
బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేటలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇంటి నుంచి బయలుదేరిన అతడు శనివారం రాత్రి కాలేజీ హాస్టల్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో ద్వితీయ సంవత్సరానికి చెందిన 25 మంది విద్యార్థులు అతడిని తమ గదిలోకి తీసుకుపోయారు. అక్కడ ఫస్ట్ఇయర్ విద్యార్థి చేత బట్టలు విప్పించారు. అనంతరం వారు తమ ఫోన్లలో అతడి వీడియోలు తీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. ట్రిమ్మర్ తీసుకుని గుండు గీసేందుకు వారు యత్నించగా.. ఆ విద్యార్థిని తప్పించుకుని అతడి గదికి వెళ్లిపోయాడు. వెంటనే విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. బాధితుడి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకున్నారు.
బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ధైర్యం చెప్పారు. కాగా.. తాము ఫిర్యాదు చేసినా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విషయమై.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డిని వివరణ కోరగా.. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఈ ఘటనపై విచారణకు నలుగురు హెచ్‌వోడీలను నియమించినట్లు తెలిపారు. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు కోరతామన్నారు.
ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఆదేశం
ర్యాగింగ్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని వెల్లడించారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.