రూ. 4వేల కోట్ల విలువైన‌ మియాపూర్ భూములను కేసీఆర్ అప్ప‌నంగా తోట చంద్రశేఖర్‌కు క‌ట్ట‌బెట్టారు

Raghunandan Rao Comments on BRS Leader CM KCR. 4వేల కోట్ల రూపాయల విలువైన‌ మియాపూర్ భూములను తోట చంద్రశేఖర్ కు సీఎం కేసీఆర్ అప్పగించారని..

By Medi Samrat  Published on  17 Jan 2023 4:20 PM IST
రూ. 4వేల కోట్ల విలువైన‌ మియాపూర్ భూములను కేసీఆర్ అప్ప‌నంగా తోట చంద్రశేఖర్‌కు క‌ట్ట‌బెట్టారు

4వేల కోట్ల రూపాయల విలువైన‌ మియాపూర్ భూములను తోట చంద్రశేఖర్ కు సీఎం కేసీఆర్ అప్పగించారని.. మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు. ఖమ్మం సభకు ఆర్థికవనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు.. ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి? అన్నారు.

తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉందని ఆరోపించారు. సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తోట చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని అనుమానం వ్య‌క్తం చేశారు. సర్వే నంబర్ 78లో జరుగుతోన్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టతీసుకెళ్తామ‌ని అన్నారు. 8 ఎకరాలకు ఒక న్యాయం, 40ఎకరాలకు ఒక న్యాయమా? అని అడిగారు.

మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారని ఆరోపించారు. బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కువ అని.. అందులో భాగంగానే బీహార్ కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారని అన్నారు.

గతంలో దొంగలుగా కన్పించిన ఆంధ్ర వాళ్ళు.‌‌. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుగా మారిపోయారని అన్నారు. చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే.. డైరెక్ట్ గా రిక్రూట్ అయినవారిని కాకుండా.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమిస్తున్నారని ఆరోపించారు.



Next Story