ఖమ్మం నగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పువ్వాడ.. నగరంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు ఖమ్మం జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసినట్లు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది.
ముఖ్యమంత్రి నిర్ణయంతో మెడికల్ కాలేజీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లా ప్రజల, విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరింది. కళాశాలకు మౌలిక సదుపాయాలు, నూతన భవనాల నిర్మాణం కోసం రూ.166 కోట్లు విడుదల చేయడంతో.. పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని, ఈ మేరకు 100 మెడికల్ సీట్లను కేటాయించామన్నారు. నగరంలో ఆర్‌అండ్‌బీ శాఖ స్థలం, తరగతుల నిర్వహణకు అనువుగా ఉన్న కలెక్టరేట్ భవన సముదాయం, నర్సింగ్ కళాశాలను వైద్య కళాశాలకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు.