తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న 35 లక్షల మంది పిల్లలకు నోటి ద్వారా పోలియో చుక్కలు వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ లైబ్రరీలు, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, టూరిజం కేంద్రాలు, విమానాశ్రయాలు, అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల వద్ద ఈ పల్స్ పోలియో డ్రైవ్ ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా 25 వేల పోలియో బూత్‌లను ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 800 మొబైల్ టీమ్‌లు, దాదాపు 8000 మంది ఎఎన్ఎంలు, 25,000 మందికి పైగా ఆశా కార్యకర్తలు పల్స్ పోలియో డ్రైవ్ కార్యక్రమంలో విధులు నిర్వర్తించనున్నారు.
మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు టీకాలు వేయడానికి క్షేత్ర స్థాయిలలో ఆరోగ్య కార్యకర్తలు మురికివాడలు, నిర్మాణ స్థలాలలో నివసించే వారికోసం ఆయాప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందుకోసం రెండు రోజులు సోమ, మంగళవారాల్లో ఇంటి వద్దకే వచ్చి పోలీయో చుక్కలు వేయనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం కోరారు. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొనాలని మంత్రి చెప్పారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు వ్యాక్సిన్ బూత్‌ల వద్దకు వచ్చేలా ప్రోత్సహించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.