'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలని, ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని సాధ్యమైనంత తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో ప్రతి సమాజం భద్రత, హక్కుల గురించి భరోసా ఇస్తూ బలమైన, స్పష్టమైన బహిరంగ ప్రకటన విడుదల చేయాలని అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరింది. ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు లేదా సమూహాలపై కఠినమైన, వేగవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), అన్ని చట్ట అమలు సంస్థలను ఆదేశించాలని కూడా గవర్నర్‌ను అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ కోరింది.
గవర్నర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో, అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ప్రచారం సమగ్ర సమాజానికి అవమానం మాత్రమే కాకుండా తెలంగాణ సామాజిక నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని అన్నారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు నుంచీ మార్వాడీ సమాజం తరతరాలుగా తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో విడదీయరాని భాగంగా ఉందని తెలిపారు. శతాబ్దాలుగా మార్వాడీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అపారమైన సహకారాన్ని అందించారని, వాణిజ్యాన్ని నడిపిస్తున్నారన్నారు. హైదరాబాద్ వంటి నగరాలను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తేల్చి చెప్పారు.