రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర గృహ సర్వేను శాంతియుతంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా సహకరించాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సజావుగా సర్వే ప్రక్రియను పూర్తీ చేయడానికి అనేక కీలక అంశాలను వివరించింది. ఈ సర్వేకు పౌరులు, అధికారులు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరింది.
అన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి పరస్పర సహకారంతో పని చేసేలా ప్రోత్సహిస్తూ సర్వేకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కమిషన్ అభ్యర్థించింది. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత కారణంగా తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) జనాభా, స్థితిగతులపై ఖచ్చితమైన డేటాను సేకరించేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించడమే కీలకమని కమిషన్ నొక్కి చెప్పింది.
సర్వేలో ఖచ్చితత్వం ఉండేలా ప్రణాళికా శాఖను బీసీ కమిషన్ కోరింది. కనీసం ఒక రోజు ముందుగా ఎన్యుమరేటర్ల సందర్శన షెడ్యూల్‌ను సంబంధిత సంఘాలకు తెలియజేయాలని సూపర్‌వైజర్లు, ఉన్నతాధికారులను కోరింది. ప్రజలు పూర్తి, ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తేనే బీసీ జనాభా విద్యా, ఆర్థిక, సామాజిక స్థితిగతుల నిజమైన వివరాలు బయటపడతాయని కమిషన్ తెలిపింది.