జాతీయ నేత‌ పర్యటనకు వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో NSUI కార్య‌క‌ర్త‌ల‌ నిర‌స‌న‌

నేడు NSUI తెలంగాణ కార్యకర్తలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రేపటి NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌద‌రీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన జరిగింది

By Kalasani Durgapraveen  Published on  25 Nov 2024 2:17 PM IST
జాతీయ నేత‌ పర్యటనకు వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో NSUI కార్య‌క‌ర్త‌ల‌ నిర‌స‌న‌

నేడు NSUI తెలంగాణ కార్యకర్తలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రేపటి NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌద‌రీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన జరిగింది. కారణం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాదవల్లి వెంకటస్వామిని NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం. ఇది తెలంగాణ యువత ఆశయాలకు, తెలంగాణ ఉద్యమం మూలసూత్రాలకు పూర్తి వ్యతిరేకం అని పేర్కొంటూ నిర‌స‌న గ‌ళం వినిపించారు.

తెలంగాణ కోసం మేము ఎంతో కష్టపడ్డాం.. మా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ, ఇప్పుడు ఆ ఉద్యమ స్పూర్తికి విరుద్ధంగా, తెలంగాణ NSUIకి ఆంధ్ర నాయకత్వాన్ని రుద్దడం ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? స్థానిక యువతకు అవకాశం లేకపోతే.. తెలంగాణ గౌరవం కాపాడేదెవరు..? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మేము జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి పలు సార్లు వినతులు సమర్పించాము. కానీ, ఇప్పటికీ మా సమస్యను పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ NSUIకి తెలంగాణలో పుట్టి పెరిగిన, ఇక్కడి బాధలు, ఆశయాలు అర్థం చేసుకున్న నాయకుడు అవసరం. ఈ నియామకం తెలంగాణ విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.

మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం.. ఈ సమస్య పరిష్కారం కాకుండా వరుణ్ చౌధరీ తెలంగాణకు రాకూడదు. న్యాయం జరిగేంత వరకు ఈ పర్యటనకు ఎలాంటి స్వాగతం ఉండదు. పర్యటన కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇది వ్యక్తిగత వ్యతిరేకత కాదు.. తెలంగాణ గౌరవం కోసం, మా హక్కుల కోసం చేసే ఉద్యమం అని పేర్కొన్నారు.

తెలంగాణ పోరాటం ఎప్పుడో ప్రారంభమైంది.. కానీ ముగియలేదు.. తెలంగాణ యువత నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడింది.. ఇప్పుడు మళ్లీ మా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ నిరసన తెలంగాణ యువత ఆత్మగౌరవానికి ప్రతీక.. మా సమస్య పరిష్కారం కాకుండా పర్యటన కొనసాగితే, విద్యార్థుల ఆగ్రహం ఏ స్థాయికి వెళ్లుతుందో ఊహించలేరని హెచ్చ‌రిక‌.

Next Story