గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని శంషాబాద్ జోన్‌లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్ తెలిపారు. డిసెంబర్ 11న (ఫేజ్–1), డిసెంబర్ 14న (ఫేజ్–2) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 163 ప్రకారం ఐదుగురికి మించి గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్, కందుకూరు, చౌదరిగూడెం, కేశంపేట, కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలింగ్ ప్రాంతాల్లో ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
ఫేజ్–1కు సంబంధించి డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 12 సాయంత్రం 6 గంటల వరకు, ఫేజ్–2కు సంబంధించి డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతున్న సమయంలో ప్రజా సమావేశాలు, గుమికూడడాలు పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.