యాదాద్రి ఆలయానికి నిజాం యువరాణి విరాళం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యువరాణి ఎస్రా రూ.5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు.
By అంజి Published on 27 Feb 2023 11:30 AM ISTహైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య అయిన యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ సుమారు రూ.5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఎస్రా రాజకుమారి తరపున యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి కిషన్ రావు నగలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతకు అందజేశారు. కిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లో నివసించే యువరాణి ఎస్రా తరచుగా హైదరాబాద్‌కు, ఆమె స్వదేశమైన టర్కీకి వెళుతూ ఉంటుంది.
యువరాణి ఎస్రాతో కొన్ని సంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్ట్ గురించి చర్చించినప్పుడు.. ఆమె ఆలయాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపింది. గత సంవత్సరం ప్రారంభంలో ఆలయం తిరిగి తెరవబడిన తర్వాత మీడియాలో ఆలయ చిత్రాలు, వీడియోలు వైరల్ కావడంతో, వ్యక్తిగతంగా ఆలయానికి విరాళం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే యువరాణి ఎస్రా ఇటీవల హైదరాబాద్ నుండి బంగారు గొలుసును కొనుగోలు చేశారు. ఆమె తరపున కిషన్ రావు ఆలయ అధికారులకు బంగారు నగలను అందించారు.
ఇంతకుముందు యాదాద్రి ఆలయాన్ని సందర్శించడానికి ఆమె ఆసక్తి చూపింది. యువరాణి ఎస్రా ఇటీవల నగరానికి వెళ్లినప్పుడు ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నప్పటికీ, గత నెలలో ముకర్రం జా మరణించిన తర్వాత ఆమె అలా చేయలేకపోయింది. అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా రూ.82825 ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు.
యువరాణి ఎస్రా
టర్కీలో జన్మించిన ఎస్రా వివాహం ద్వారా యువరాణి అయ్యారు. ఆమె 1959లో హైదరాబాద్‌లోని అసఫ్ జా రాజవంశానికి చెందిన ప్రిన్స్ ముక్కరం జాను వివాహం చేసుకుంది. వారి 15 సంవత్సరాల వివాహంలో వారికి ఒక కుమార్తె షేఖ్య, కుమారుడు అజ్మెత్ జా ఉన్నారు. అసఫ్ జా యొక్క ప్రస్తుత అధిపతిగా అజ్మెత్ జా ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న యువరాణి చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌ల పునరుద్ధరణతో ఘనత పొందారు.
యాదాద్రి దేవాలయం
ఇది తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టలో కొండపై ఉన్న దేవాలయం. 2016లో ప్రారంభమైన ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం మార్చి 2022లో పూర్తయింది. దీనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్చి 28, 2022న ప్రారంభించారు. పూర్తిగా రాతితో నిర్మింపబడిన ఈ ఆలయ స్థావరం ఇప్పుడు 14 ఎకరాలు. గతంలో రెండు ఎకరాల్లో నిర్మించారు.