ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి కాల్ వచ్చింది. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ కుమార్ ను ఫోన్‌లో అభినందించారు మోదీ. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని సంజయ్ కు మోదీ సూచించారు.
''మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీలు నడిచాను'' అని మోదీకి చెప్పారు బండి సంజయ్. ''నడిచింది నేనయినా.. నడిపించింది మీరే.. మీరు చెప్పిన ''సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్'' పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేసినట్లు వివరించారు బండి సంజయ్.
పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని సంజయ్ ను అడిగారు మోదీ.. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తుండoతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు సంజయ్. తెలంగాణా నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు బండి సంజయ్. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని చెప్పారు సంజయ్. ప్రధానమంత్రి కాల్ తో కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తదని సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్.