రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో కుల గణనపై ప్రజెంటేషన్
By Knakam Karthik
రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో కుల గణనపై ప్రజెంటేషన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్‌లో ఈ ప్రజెంటేషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దానిలో తలెత్తిన వివాదాలు, అవకతవకలపై ఈ ప్రజెంటేషన్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనారిటీ హక్కులపై మంత్రులు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనపై ప్రజల్లో స్పష్టత తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకోవడంతో పాటు, విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కులగణనపై ఈ ప్రజెంటేషన్ అనంతరం మరింత చర్చ కొనసాగే అవకాశముంది.
మరో వైపు కులగణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని అన్నారు. మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.