హైదరాబాద్: హుజురాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య రామగుండం ఎన్టీపీసీ ఫ్లై యాష్ వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రచ్చ కొనసాగిస్తున్నారు. కరప్షన్ చెయ్యకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఫిలింనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని పొన్నం కోసం పాడి కౌశ్ రెడ్డి ఎదురు చూశారు.
అయితే ఆలయానికి పొన్నం ప్రభాకర్ రాకపోవటంతో పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందని పేర్కొన్నారు. తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు పొన్నం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును బ్లాక్ డైరీలో మొదటి పేజీలో రాశానని, అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం నాడు అన్నారు.
బ్లాక్ బుక్‌ను పట్టుకుని పొన్నంపై చర్యలు తీసుకోవాలని మొదటి పేజీలో పొన్నం పేరు రాశానని చెప్పారు. ఈ కుంభకోణంపై పాడి కౌశిక్ రెడ్డి, పొన్నం ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై పొన్నం ముందుగా స్పందిస్తూ, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.