ఏడు సంవత్సరాల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఏమీ చేయలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచుతున్నారని మండిపడ్డారు. దేశంలో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ పోర్ట్ భారం పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని.. ఇది ప్రజా హితమైన పాలననా అని ప్రశ్నించారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు.
పార్లమెంట్ లో చర్చ లేకుండా వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారని.. బిజెపి హుజురాబాద్ ప్రజలకు వీటిపై ఏం సమాధానం చెబుతారని అడిగారు. కేంద్ర ప్రభుత్వానికి అన్నింటికీ మద్దతు ఇస్తున్న కేసీఆర్ కూడా హుజురాబాద్ ప్రజలకు వీటిపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఏం మొహం పెట్టుకొని టీఆర్‌ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోదీల అప్రజాస్వామిక పాలనకు హుజురాబాద్ ప్రజలు బుద్ది చెప్పాలని.. కాంగ్రెస్ కు మద్దతు పలికి.. గెలిపించాలని కోరారు.