బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో
By Medi Samrat Published on 16 Oct 2023 6:19 PM IST
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య సోమవారం పార్టీలో చేరారు. జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కండువా కప్పి పొన్నాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆయనతో పాటు జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ 18వ వార్డు కౌన్సిలర్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు అవమానాలకు గురయ్యానన్నారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. జనగామలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేయించారన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య ఇటీవల రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పార్టీని వీడారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని.. సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని పొన్నాల వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని పొన్నాల చెప్పారు. జనగామ టికెట్ దక్కదని తెలిసి పొన్నాల పార్టీని వీడినట్లుగా తెలుస్తుంది.