ప్లీనరీలో కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారు
Ponnala Lakshmaiah Fires On CM KCR. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
By Medi Samrat
టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టారని.. ప్లీనరీలో కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసే మాటలు చెప్పారని.. సాగునీటి ప్రాజెక్ట్ లు పుర్తి చేశానని కేసీఆర్ చెప్పిన మాటలు పచ్చి అబద్దమని.. ఏడేళ్ల పాలనలో ఒక్క ఏకరానికన్నా అదనంగా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. జీడీపీపై చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని అన్నారు.
ఐటీ పరిశ్రమ గురించి గొప్పలు చెప్పారని.. మీ హయాంలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్నో చెప్పగలరా అని నిలదీశారు. మేము వేసిన పునాదులపై పెరిగిన వాటిని మీ ఖాతాలో వేసుకుంటారా అని ఫైర్ అయ్యారు. గూగుల్, అమెజాన్ కంపెనీ లు మా హయాంలో పడ్డ పునాదులని అన్నారు. మిషన్ కాకతీయ గురించి గొప్పలు చెప్పారు.. ఈ పథకం అంతా అవినీతిమయమని.. రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
హుజురాబాద్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్, బీజేపీలకు లేదని.. అవినీతి ఆరోపణలతో ఈటెలను బయటికి పంపారు. కేసీఆర్ కుటుంబంపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి.. వాటిపై విచారణ ఎందుకు జరపరని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా సీబీఐ, ఈడి విచారించలేదా..? కేసీఆర్ పై సీబీఐ, ఈడీ విచారణలపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని అడిగారు. అవినీతి ఆరోపణలు వచ్చిన ఈటెలను బీజేపీ ఎలా పార్టీలో చేర్చుకుంటుందని ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజలు అవినీతి పరులైన టీఆర్ఎస్, బీజేపీ లకు ఓట్లు వేయవద్దని కోరారు.