ఆ నమ్మకంతోనే పార్టీలో చేరాను.. తెలంగాణ ప్రజలే నాకు గాడ్ ఫాదర్లు : పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivasareddy Sensational Comments. ఖమ్మం జిల్లా రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
By Medi Samrat Published on 10 Jan 2023 4:31 PM ISTఖమ్మం జిల్లా రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని తీవ్ర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తొగ్గూడెం సమ్మక్క-సారక్క గుడి వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ కుటుంబం లో పుట్టిన తాను.. స్వయంగా వ్యవసాయం చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లో నాకు గాడ్ ఫాదర్ ఎవ్వరు లేరు. తెలంగాణ ప్రజలే నాకు గాడ్ ఫాదర్లని పేర్కొన్నారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా మనిషిని గౌరవించాలని అన్నారు. పదవులు అవే వస్తాయి.. పోయేటప్పుడు అవే పోతాయని అన్నారు.
నేను ప్రజల కష్ట సుఖాలు పంచుకోవాటానికే పినపాక నియోజక వర్గానికి వచ్చానని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ప్రజలు నన్ను తిరస్కరించారా.. ఏమి జరిగిందో యావత్తు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. తానేమీ భూదందాలు చేయలేదని, గొంతెత్తకుండా మాత్రం ఉండలేనని స్పష్టం చేశారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే నాడు టీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు. అయితే, నాలుగేళ్లుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. నిజాన్ని అప్పుడూ నిర్భయంగా చెప్పాను, ఇప్పుడూ చెబుతాను.. నా వ్యాపారలావాదేవీలపై త్వరలోనే చెబుతాను అని తెలిపారు.
నేను సెక్యూరిటీ అడిగితే మీరు ఇవ్వలేదు.. ఇప్పుడు ఉన్న ఇద్దరు గన్ మన్లను తీసేసినా నేను బాధపడను.. లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదం నాకు ఉన్నంతవరకు ఎలాంటి గన్ మ్యాన్లు అవసరం లేదు.. గౌరవం లేని చోట నీ గన్ మ్యాన్లు అవసరం లేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంట్రక్టర్ కాలేదని.. టీఆర్ఎస్ పుట్టకముందే కాంట్రాక్టర్ ను అని తెలిపారు. కష్టాలొస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి జోల ఎత్తుకుని రాజకీయం చేస్తానని అన్నారు.