ముప్పై రోజుల పాటు కష్టపడితే మీ కష్టాలు తీరుతాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, పాలేరుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించి తనను, తుమ్మల నాగేశ్వరరావును
By Medi Samrat Published on 4 Nov 2023 4:45 PM ISTముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, పాలేరుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించి తనను, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలని చూస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం నేలకొండపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డబ్బు ఒక్కటే ఎన్నికల్లో రాజకీయం చేయదని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతల అహంకారనికి, అధికార మదానికి... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్‌స్టాప్ పెట్టే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, మీకు అండగా తాము ఉంటామన్నారు. ముప్పై రోజుల పాటు కష్టపడితే, ఆ తర్వాత మీ కష్టాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అరాచకం పెరిగాయని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను, పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని ఖమ్మం జిల్లాలో బలోపేతం చేశామన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమను దూరం చేసి పార్టీని నాశనం చేసుకున్నారన్నారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల్లా పనిచేయాలన్నారు. తాను, పొంగులేటి ఇద్దరం కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో చెరో స్థానం నుంచి బరిలో నిలిచినట్లు చెప్పారు. కరవు కాటకాలు, పల్లేర్లు మొలచిన పాలేరును తాను అభివృద్ధి చేశానన్నారు. మట్టి పిసుక్కునే తనను మంత్రిగా చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.